తెలంగాణా ప్రత్యేక ప్యాకేజీపై కాంగ్రెస్ లో కలవరం
Published on: Sat Mar 3, 2012 1:19PM
హై
దరాబాద్: తెలంగాణాప్రాంతంలో జరగబోతున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలకు కలవరం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అన్న నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుదామనుకున్న కాంగ్రెస్ నాయకులకు ఇటీవల వచ్చిన వార్తలు దిగ్బ్రాంతికి గురిచేశాయి. తెలంగాణాకోసం ప్రత్యేక మండలిని ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు, అలాగే ఈ ప్రాంత అభివృద్దిని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండటం కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది కలిగించింది. కేంద్రానికి తెలంగాణా ఇచ్చే ఉద్దేశం లేదు కనుకనే ఇటువంటి ఆలోచనలను చేస్తున్నదన్న భావన ప్రజల్లో కలుగుతోందని వారు అంటున్నారు. "తెలంగాణాపై మా పార్టీ వైఖరి స్పష్టంగా లేదు. తెలంగాణా ఇస్తామని ఏనాడూ ప్రకటించలేదు. ఇప్పుడు మాత్రం ప్రత్యేక మండలి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలు చేస్తున్నారు. అంటే దీనర్ధం తెలంగాణా ఇవ్వడం లేదని. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉన్న ఈ సమయంలో ఎన్నికలు రావడం, ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రకటనలు చేయడం పార్టీకి ఏవిధంగానూ లాభించదు" అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలుగువన్.కామ్ కు చెప్పారు. ప్రభుత్వ వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికీ ప్రత్యేక తెలంగాణా ఇవ్వదని, ఆ పార్టీ సారధ్యంలోని ప్రభుత్వం పతనమైతేనే ప్రత్యేక తెలంగాణా వస్తుందని టిఆర్ఎస్ నాయకులు ఓటర్లకు చెబుతున్నారు. అసలు తెలంగాణా ఇస్తారా లేదా అన్న విషయం తేల్చకుండా ప్రత్యేక మడళ్ళు, ప్రత్యేక ప్యాకీజీలు ఎందుకని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.


