బెదిరింపులకు పాల్పడుతున్న బీడి యాజమాన్యాలు
Published on: Mon Feb 27, 2012 2:07PM
హైదరాబాద్: తెలంగాణా ప్రాంతంలోని బీడి ఫ్యాక్టరీల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. రాష్ట్ర కార్మికశాఖ వేతనాలు పెంచుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోకపోతే లాకౌట్ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సహకారంతో జీవో అమలును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాక తెలంగాణా ప్రాంతం యావత్తూ బీడి కార్మికులకు జనవరి నెల వేతనాలను యజమానులు ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో బీడి కార్మికుల్లో ఆందోళన చెలరేగింది. కార్మికుల వేతనాలకు సంబంధించిన యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరివల్ల 16 నెలలుగా బీడి పరిశ్రమలలో అయోమయం నెలకొంది. 32 రోజుల సమ్మె, 6 రోజుల లాకౌట్, కార్మిక సంఘాల్లో చీలిక, జీవోకన్నా తక్కువ వేతనాలకు ఒప్పందంలాంటి పరిణామాలు పేద మహిళాకార్మికుల్లో అనుమానాలు, భయాందోళనలు కలిగించాయి.
వెయ్యి బీడిలు చుట్టినందుకుగాను ప్రస్తుతం అన్ని ప్రయోజనాలతో కలుపుకుని 102 రూపాయల రోజువారీ వేతనం ఇస్తున్నారు. ఈ వేతనాన్ని పెంచాలన్న డిమాండ్ తో 2010లో కార్మిక సంఘాలు 32 రోజులపాటు సమ్మెచేశాయి. దీంతో కార్మికశాఖ 2011 జూన్ 30న ఒక జీవో తీసుకొస్తూ రోజువారీ వేతనాన్ని 158 రూపాయలుగా ఖరారు చేసింది. దీనికి నిరసనగా యాజమాన్యాలు లాకౌట్ ప్రకటించాయి. కార్మికశాఖ తెచ్చిన ఈ జీవోను సవరించడానికి యాజమాన్యాలతో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కైనట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


