టీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు
Published on: Fri Feb 17, 2012 10:48AM
హైద
రాబాద్ : తెలంగాణపై తీర్మానం చేయాలంటూ సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న 12మంది టీఆర్ఎస్ సభ్యులపై ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటు పడింది. అరగంట వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా టీఆర్ఎస్ సభ్యులు తమ పట్టు వీడకపోవటంతో స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆందోళన చేస్తున్న సభ్యుల్ని సభ విడిచి వెళ్లాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సస్పెండ్ అయినవారిలో హరీశ్‌రావు, కేటీఆర్, ఓదెలు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగరరావు, వినయ్ భాస్కర్, అరవింద్ రెడ్డి, చెన్నమనేని రమేష్, రవీందర్ రెడ్డి, కావేటి సమ్మయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సోమారపు సత్యనారాయణ ఉన్నారు. గత నాలుగురోజులుగా ఎటువంటి చర్చా చేపట్టని అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీంతో సభ సజావుగా సాగేందుకు ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు..సభ నుంచి టీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు.
కాగా, అసెంబ్లీ నుంచి బీజేపీ, సీపీఐ శుక్రవారం వాకౌట్ చేశాయి. తెలంగాణ అంశంపై తీర్మానం చేయకపోవటాన్ని నిరసించటమే కాకుండా, సభ నుంచి టీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెన్షన్ చేయటాన్ని నిరసిస్తూ రెండు పార్టీల సభ్యులు సభను బహిష్కరించారు.
కాగా, మమ్మల్ని సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు... ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా సస్పెండ్ చేస్తారంటూ సభ నుంచి సస్పెండ్ అయిన టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలిస్తానన్న నేతలు సభలోనే ఉన్నా నోరెందుకు మెదపలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, పోచారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై తీర్మానం చేయమన్నందుకే సస్పెన్షన్ విధిస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.
కాగా, ఉప ఎన్నికల ఫెడ్యూలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను వాయిదా వేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడితే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను వాయిదా వేసిందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ అన్నారు. రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలన్నారు.
కాగా, రాష్ట్ర బడ్జెట్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలను ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కొట్టిపారేశారు. మీడియాలో వచ్చింది గత సంవత్సరపు ప్రతిపాదనలే అని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్ లీక్ అయితే ఇబ్బందులు కానీ... రాష్ట్ర బడ్జెట్‌కు అలాంటి ఇబ్బందులేమీ ఉండవని ఆనం అన్నారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీలో అయిదో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సమావేశాలు ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే అసెంబ్లీ అరగంటపాటు వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి, తెలంగాణపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు తమ పట్టు వీడలేదు. దాంతో సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు.


