తెలంగాణ 'తథ్యం'బాంబు పేల్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం
Published on: Sun Feb 12, 2012 8:56AM
హై
దరాబాద్: నేడుకాకున్నా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రం తథ్యమని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్ అన్నారు. 24రోజుల పాటు జరిగిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ పోరుయాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు పార్టీకి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన రమణ్‌సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చత్తీస్‌గఢ్ చిన్న రాష్ట్రం అయిన తర్వాతనే ఎంతో అభివృద్ధి సాధించిందని, జాతీయ వ్యవసాయ సగటు అభివృద్ధి రేటు 2.3 శాతమైతే మా రాష్ట్ర సగటు 6.4గా ఉందన్నారు. దేశంలో 22% ఇనుము ఉత్పత్తి మాదే. 30% సిమెంటును మేమే ఉత్పత్తి చేస్తున్నామని, మా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఉండవని, ఎవరికైనా అరగంట పాటు విద్యుత్తు లేకపోతే నేరుగా సిఎంకే ఫోన్ చేస్తారన్నారు. ఈ ప్రగతంతా చిన్న రాష్ట్రం కావడం వల్లే సాధ్యమైందని, కానీ చిన్న రాష్ట్రాల వల్ల ప్రగతి సాధ్యం కాదని కొన్ని పార్టీలు చెబుతున్నాయని, అంతగా అనుమానాలుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ పరిశీలించుకోవచ్చునని సవాలు విసిరారు. ఒకనాడు తెలంగాణ ఏర్పాటుకు జరిగిన పోరాటమే చత్తీస్‌గఢ్ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచిందని, నేడు ఛత్తీస్‌ఘడ్ ఏర్పాటైనా తెలంగాణ ఇంకా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాటం చేస్తునే ఉందని వ్యాఖ్యానించారు.
ఇంత ఉద్ధృతంగా పోరాటం జరుగుతున్నా ఢిల్లీ నేతలకు కనికరం కలగడం లేదని, 1997లోనే తెలంగాణ ఏర్పాటుకు తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత బిజెపిదేనని అన్నారు. ఢిల్లీ పెద్దలు మాత్రం రకరకాల కమిటీలు, కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలుపుకున్నామని, చత్తీస్‌గఢ్ అభివృద్ధి ప్రేరణతో తెలంగాణ ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతికి ఢిల్లీలోని తీహార్ జైలు చిన్నదైపోతోందని వ్యాఖ్యానించారు. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడ్డ రేవడిలా మారే అవకాశముందని వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కాగానే చేలకు నీళ్లు చేతికి పనులు చెబుతామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి అన్నారు. తాము చేస్తున్న ఉద్యమం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని, అమెరికా సైతం తమ రాష్ట్రాలను చిన్నగా విభజించుకుందని, వికేంద్రీకరణకు తాలూకాలను మండలాలుగా విభజించిన తెలుగుదేశం పార్టీ నేడు తెలంగాణను మాత్రం అడ్డుకుంటోందని అన్నారు. తెలంగాణ మలి దశ పోరాటానికి ఇది ఆరంభ సభ అవుతుందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నేటి శంఖారావం రానున్న పోరాటాలకు ఆరంభమని వ్యాఖ్యానించారు.


