TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వలస వాదులవల్ల తెలంగాణ రాదు..కేసీఆర్ పై మోత్కుపల్లి

Published on: Fri Feb 10, 2012 9:11AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కేసీఆర్, విజయశాంతిలు ఆంధ్రా ప్రాంత వలసవాదులని ఆయన  ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చిన ఇలాంటి వారి ఉద్యమం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కెసిఆర్ మరోసారి సిద్ధమవుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సకల జనుల సమ్మెను అమ్ముకొని పోలవరం టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు. టెండర్ల కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కెసిఆర్ అవమానించారన్నారు. అందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్లు స్పీకర్ ముందు పెట్టాలన్నారు. టెండర్లను హైపవర్ కమిటీ రద్దు చేసిందని, దాంతో తాము చేసిన ఆరోపణలు నిజమని తేలాయన్నారు. ఇకపోతే... కేసీఆర్ చేసిన అవమానం వల్లే తెరాస సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ కుమిలి కుమిలి చనిపోయారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులను తన కేబినెట్లో కొనసాగిస్తున్నారని మరో నేత రేవంత్ రెడ్డి వేరుగా ఆరోపించారు.