యాకూబ్ కేసు:సిబిఐ దర్యాప్తుపై సుప్రీం స్టే
Published on: Mon Feb 6, 2012 11:22AM
న్యూ
ఢిల్లీ: తెలంగాణ విద్యార్థి యాకూబ్ రెడ్డి కేసులో సిబిఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. యాకూబ్ రెడ్డిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారనే ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై గత 11 రోజులుగా సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు సోమవారం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మధ్య కాలంలో వరంగల్‌లో యాకూబ్ రెడ్డిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారనే ఆరోపణలు వచ్చాయి.
వరంగల్ జిల్లాలో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి యాకూబ్ రెడ్డిపై పోలీసుల దాడి ఘటనపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జనవరి 5వ తేదీన సిబిఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ గులాం అహ్మద్, జస్టిస్ కెజి శంకర్‌తో కూడిన ధర్మాసనం మూడు నెలల్లో దాడికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సిబిఐని ఆదేశించింది. నిరుడు తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలో భాగంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిపై దాడి చేసిన సంఘటనలో యాకూబ్ రెడ్డి నిందితుడు. ఇతనిని పోలీసులు నిరుడు ఆగస్టు 7వ తేదిన అరెస్టు చేశారు.


