నాగం పై టీడీపీ వ్యూహరచన..రంగంలోకి మర్రి జనార్ధన్ రెడ్డి
Published on: Sat Jan 28, 2012 1:56PM
హై
దరాబాద్: తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో ఈ ఎన్నికలు జరిగే స్థానాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ కోసం తమ పదవులను త్యజించిన నేతలు తిరిగి పోటీ చేసి గెలుపొందేందుకు నాగం లాంటివారు తమ వంతు పయత్నాలు మొదలెట్టారు. ఈయన నాగర్ కర్నూల్ స్థానం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తెదేపాకు రాజీనామా చేసిన ఆయన.. ఏ రాజకీయ పార్టీలో చేరకుండా తెలంగాణ నగరా సమితిని స్థాపించి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమై ఉప ఎన్నికల అంశంపై చర్చించారు. నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్రంగా పోటీకి దిగితే తనపై తెరాస తరపున అభ్యర్థిని బరిలోకి దించొద్దని ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. స్వతంత్రంగా పోటీ చేయడం కంటే తెరాస అభ్యర్థిగానే బరిలోకి దిగాలని సూచించినట్టు తెరాస శ్రేణుల సమాచారంగా . ఈ నేపథ్యంలో... పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీని, పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న నాగంను ఉప ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులోభాగంగా... జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన ప్రముఖ వస్త్ర వ్యాపారి జేసీ బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని తెదేపా అధినాయకత్వం నిర్ణయించి, ఈ మేరకు జనార్ధన్ రెడ్డికి సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన కూడా అదే నియోజకవర్గానికి చెందినవారు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఒక్కసారిగా అక్కడ పోటీ రసవత్తరంగా మారింది.


