కాంగ్రెస్, టీడీపీలఫై కిషన్‌రెడ్డి ఫైర్
Published on: Mon Jan 23, 2012 8:22AM
మహబూ
బ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపి వంటి జాతీయ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ పోరు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ సాధన కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని స్పష్టం చేశారు.జేఏసీలన్నీ కలిసి సమిష్టగా తెలంగాణ కోసం పోరాడాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడాలని కోరారు. రెండో ఎస్సార్సీలో తెలంగాణ అంశం లేదంటున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఎస్సార్సీతో పని లేదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్అల్వీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె తరువాత ఉద్యమం బలహీనపడిందని వ్యాఖ్యలు చేస్తున్న వారు పోరుయాత్రకు వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. టిడిపి, కాంగ్రెస్‌లపైనా ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణిని, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో సమాధానవివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్, టిడిపికి స్పష్టమైన విధానమే లేదని, ప్రాంతానికో మాట మాట్లాడుకుంటూ తెలంగాణపై ఉద్యమిస్తున్న వారిని మాత్రం విమర్శిస్తున్నాయని దుయ్యబట్టారు బిజెపిని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని నిప్పులు చెరిగారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై బిల్లు ప్రవేశపెట్టకపోతే, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తామే తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ కోసం 750 మంది బలిదానం చేసుకున్నా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మనస్సు చలించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆత్మబలిదానాలకు సోనియాగాంధీ, చంద్రబాబులే బాధ్యత వహించాలని అన్నారు.


