తెలంగాణకు ఆ రెండు పార్టీలే అడ్డు: కోదండరామ్
Published on: Sun Jan 22, 2012 8:36AM
హై
దరాబాద్: ఏప్రిల్‌తో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా చేస్తామని అయన అన్నారు. తెలంగాణకు ఆ రెండు పార్టీలే అడ్డుగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లా స్థాయిల్లో జెఎసి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని, 31వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు. మార్చిలో తెలంగాణవ్యాప్తంగా బస్సు యాత్రలు చేస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.శాసనసభ వేదికగా తెలంగాణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె విరమణ సమయంలో ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. సీమాంధ్ర నాయకుల వల్ల, వారికి వత్తాసు పలుకుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల వల్ల లక్ష్యసాధనలో వెనకబడుతున్నామని, సకల జనుల సమ్మెను అవూర్వంగా నిర్వహించినా ఆ శక్తులు అడ్డు పడ్డాయని ఆయన అన్నారు.


