TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణపై కేంద్ర వైఖరిని స్పష్టం చేయాలి: బాపూజీ

Published on: Tue Jan 10, 2012 8:34AM

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదా అనేది కేంద్రం స్పష్టం చేయాలని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ డిమాండ్‌ చేశారు.  అశోక్‌నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలోఅయన  మాట్లాడుతూ  నివేదికలు, చర్చలు అంటూ కేంద్రం కాలయాపన చేయడం వల్ల ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందన్నారు. తెలంగాణపై టిడిపి అధినేత చంద్రబాబులో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న ఆయన అనూకూల ప్రకటన చేయాలని కోరారు. సమైక్యాంధ్ర అంటున్న ఎంపీ లగడపాటిలో కూడా మార్పు కనిపిస్తోందని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని ఈరోజు చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ వస్తే మా ద్వారా రావాలన్న తత్వంతో ఒక చిన్న పార్టీ పేచీ పెడుతోందని పరోక్షంగా టిఆర్‌ఎస్‌ను విమర్శించారు.వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైయస్ జగన్ యువకుడు అయినందున తొందరపాటుతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీల ప్రయోజనాలు తప్ప చిత్తశుద్ధి లేకపోవడమే తెలంగాణకు ప్రధాన ఆటంకమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే చర్యలను ఆపాలని ఆయా ప్రాంతాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు 11న గాంధీభవన్‌లో ప్రకాశం హాలులో మూడు ప్రాంతాల నాయకులను కలిపి సద్భావనా సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. శాంతియుతంగా విడిపోయేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామని పేర్కొన్నారు.