TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేను తెలంగాణాకు వ్యతిరేకం కాదు పాలకుర్తి సభలో బాబు

Published on: Sat Jan 7, 2012 8:11AM

వరంగల్: "తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు. భవిష్యత్తులో కూడా వ్యతిరేకించబోను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సేనని తేల్చి చెప్పారు. రైతు పోరుబాట యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. 14 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర నిర్వహించి, పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఏనాడు మాట్లాడకపోయినా తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై పార్టీని ఖతం చేయాలని ప్రణాళిక రచిస్తోందన్నారు. తెలంగాణ విషయంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానన్నారు. ఇంతకుమించి ఇంకా తెలంగాణ విషయంలో ఏ స్పష్టత ఇవ్వాల్సి ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో తెరాస కన్నా తెలుగుదేశం పార్టీయే బలంగా ఉన్నదని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నదనీ, నిర్ణయం తీసుకోకుండా దొంగనాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.  తను వచ్చే దారిలో తెరాస విలేకరులపై దాడులు చేయించిందనీ, ఎర్రబెల్లి ఇంటిపై దాడి చేసేందుకు యత్నించిందన్నారు. తెరాస దాడులకు భయపడేది లేదనీ, ఆ దాడులను తిప్పికొట్టగల సామర్థ్యం తెలంగాణ తమ్ముళ్లకు ఉన్నదని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలనుకునేవారే ఖతం అయిపోతారని హెచ్చరించారు. 

"తెలుగింటి ఆడపడుచులు, యువత, పిల్లలు, తమ్ముళ్ల అభిమానంతో.. ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ ఏర్పాటయింది. బడుగు, బలహీన వర్గాలకు వేదికగా నిలిచిన టీడీపీని ఖతం చేయాలని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. తమ్ముళ్ల అండ ఉన్నంత కాలం ఈ పార్టీని ఎవరూ ఏమి చేయలేరు'' అని స్పష్టం చేశారు.  సామాజిక న్యాయం పేరుతో ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యం కూడా కాంగ్రెస్ కంపులో కలిసిపోయిందని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్ కూడా రేపో, మాపో కాంగ్రెస్‌లో కలుస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇస్తోందన్నారు. రైతు సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీఆర్ఎస్ ఎందుకు బలపరచలేదని ప్రశ్నించారు. పంటలు నష్టపోయి కుంగిపోతున్న రైతన్నలను ఆదుకునేందుకే రైతుపోరు బాట మొదలుపెట్టామన్నారు. పంట నష్టం కనబడుతున్నా ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఏసీ గదిల్లో కూచుని నిద్రపోతోందని మండిపడ్డారు. వరి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందనీ, స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. తన శరీరంలో చివరి రక్తం బొట్టు ఉన్నవరకూ రైతుల కోసమే శ్రమిస్తాననీ, రైతులకు అండగా ఉంటాననీ, ఈ పోరాటం ఇంతటితో ఆగదని, రైతుకు న్యాయం జరిగే వరకూ సాగుతుందని చంద్రబాబు అన్నారు.

కిరణ్ సర్కార్ పనికి మాలిందని, ప్రజా సంక్షేమం పట్టని దద్దమ్మ ప్రభుత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన సంస్కరణల ఫలితమే కిరణ్ చెప్పుకుంటున్న లక్ష ఉద్యోగాల భర్తీ అన్నారు. పెట్రో, నిత్యావసరాల ధరలు ఎన్నడూ లేని రీతిలో పెరిగాయన్నారు. ధరలు తగ్గించడం చేతగాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుకు పరిమితమైందని, స్కాలర్‌షిప్స్ అందడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కోట్లు వెనకేసుకోవడంలోనే కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందనీ, పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు సభలో కలకలం సృష్టించారు. సభ మధ్యలోంచి కొందరు యువకులు 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేస్తూ వేదికపైకి బూట్లు విసిరారు. మరికొందరు కుర్చీలు ఎత్తిపడేసారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారికి ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.