TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎట్టకేలకు పోరుయాత్ర ప్రారంభించిన బాబు

Published on: Fri Jan 6, 2012 1:33PM

వరంగల్: తెలంగాణవాదుల ఆందోళనలను లెక్కపెట్టకుండా.. చంద్రబాబు వరంగల్‌ జిల్లాలో రైతు పోరుయాత్ర ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా లక్ష్మక్కపల్లెకు చేరుకున్న బాబు.. మొదట స్థానిక ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం రైతు పోరుయాత్ర ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు ఈ యాత్రకు హాజరయ్యారు. రైతు సమస్యలను తెలుసుకుంటూ బాబు ముందుకు సాగుతున్నారు.


కాగా, టీఆర్ఎస్ సింగిల్ టార్గెట్ తెలుగుదేశం పార్టీయేనని... టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సెంటిమెంట్ ముసుగులో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేయటం తగదని ఆయన హితవు పలికారు. ఆత్మహుతి దాడులు చేస్తామని హెచ్చరించేందుకు చంద్రబాబు ఉగ్రవాదా అని ఎర్రన్నాయుడు ప్రశ్నించారు.

కాగా, పాలకుర్తిలో చంద్రబాబు సభకు వెళ్తున్న ఇల్లెందు ఎమ్మెల్యే భూకా అప్పయ్య కాన్వాయ్ను మానుకోటలో తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. కాన్వాయ్ లోని మూడు వాహనాలను ధ్వంసం చేయడంతో టిడిపి,టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మానుకోటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న టిడిపి నేతల వాహనాలను తెలంగాణ వాదులు అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు.


కాగా, పోలీసుబలగాలతో , అక్రమ అరెస్టులతో భయాందోళనలు సృష్టించి తెలంగాణవాదాన్ని అడ్డుకోలేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబుయాత్రను అడ్డుకుంటారనే అనుమానంతో కరీంనగర్‌లో ఈశ్వర్‌ను పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. ఆయన ఇంటిముందు మోహరించిన పోలీసులు బయటకురాకుండా కట్టడి చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని చంద్రబాబుకు ఈ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కులేదని ఈశ్వర్‌ మండిపడ్డారు.