తెలంగాణ నా ఊపిరి ,మరల దీక్ష చేస్తా: కేసీఆర్
Published on: Tue Dec 27, 2011 7:45AM
హైదరాబా
ద్ : తెలంగాణ తన ఊపిరి అని ,తెలంగాణ కోసం మరోమారు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో తోలు మందపు ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయన్నారు. టీఆర్ఎస్ భవన్లో టీలెక్చరర్ల క్యాలెండర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఈ దీక్ష ఉంటుందని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని విరమించేది లేదని, వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. విరామం, సమయం ఇచ్చామని, అయినా ఫలితం లభించడం లేదని ఆయన అన్నారు. జనవరిలో సంక్రాంతి పర్వదినం తర్వాత ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. జాప్యం చేస్తే విద్వేషాలు మరింత పెరుగుతాయని, భౌగోళిక ఎడబాటుకు సీమాంధ్ర నాయకులు అంగీరించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని చెప్పారు.సమాజ్వాదీ పార్టీ తప్ప జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. గమ్యాన్ని ముద్డాడే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. తెలంగాణ ఉద్యమం చల్లారలేదన్నారు. పూర్తిస్థాయి ఉద్యమం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. సమయాన్ని బట్టి ఓ వ్యూహంతో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ రాజకీయ నేతల కారణంగానే తెలంగాణ రాకుండా పోతుందని ఆయన తెలిపారు. దాన్ని సాధించే వరకు మడమ తిప్పనని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం సాధించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాలదే విజయమని, చరిత్రలో ధర్మం, న్యాయమే గెలిచిందని ఆయన అన్నారు. పాండవులు ఐదుగురే అయినా ధర్మం వైపు ఉన్నారు కాబట్టి గెలిచారని ఆయన అన్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సంతరించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కెసిఆర్ మాట్లాడినా వార్తే, మాట్లాడకున్నా వార్తేనని ఆయన అన్నారు. వెన్నెముక లేని తెలంగాణ నాయకులే తెలంగాణ శాపమని ఆయన అన్నారు. తాము విశ్వప్రయత్నం చేశామని, రాజీనామా చేయాలని సూచించామని, రాజీనామాలు చేస్తే మళ్లీ గెలిపిస్తామని చెప్పామని ఆయన అన్నారు. నిజస్వరూపాలు బయటపడిన తర్వాత కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మెడ కత్తి పెట్టి తెలంగాణ ఇవ్వాలంటే ఇబ్బందులుంటాయని ప్రధాని అన్నారని ఆయన చెప్పారు. అడిగినందువల్ల కేంద్రానికి సమయం ఇచ్చామని ఆయన చెప్పారు. తనకేమీ కాలేదని, తాను సరిగానే ఉన్నానని, తమ వ్యూహాలు తమకు ఉంటాయని ఆయన అన్నారు.


