టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టులో తెలంగాణ బిడ్డ
Published on: Mon Nov 21, 2022 10:30AM
టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టులో తెలంగాణ అమ్మాయికి చోటు లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగనున్న మహిళల టి20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరిస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ జట్లులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిషకు స్థానం దక్కింది.
ఈ నెల 27న జరగనున్న తొలి మ్యాచ్ లో టి20 సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 మ్యాచ్ లూ ముంబై వేదికగానే జరగనున్నాయి. కాగా అండర్ 19 మహిళల జట్టులో స్థానం సంపాదించిన త్రిష ఎనిమిదేళ్లకే జిల్లా స్థాయిలో రాణించింది.
అలాగే బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష ప్రాతినిథ్యం వహించింది. జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ-2021లోను త్రిష ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టుకు త్రిష ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.


