సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైనప్పటినుండి వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొద్ది రోజుల క్రితం అయన కార్యాలయం ఐన ప్రగతి భవన్ లో 30 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అయన అటు మీడియా సమావేశాల్లో కానీ లేదా అధికారుల తో సమీక్షలు కానీ నిర్వహించినట్లుగా పెద్దగా సమాచారం లేదు. దీనికి తోడు ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కి రావద్దన్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అక్కడి నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలన సాగించేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

ఐతే ఇపుడు కేసీఆర్ ఆరోగ్యం పై స్పష్టత కోరుతూ హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలైంది. నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న ఈ పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ లో ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో లేదా అందుబాటులో లేరన్న సాకు తో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సక్రమంగా పనిచేయట్లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా ఉందో అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని పిటిషనర్ తెలిపారు. గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి రోజు కేసీఆర్ చివరిసారిగా మీడియా ముందుకు వచ్చారని ఆ పిటిషన్‌లో తెలిపారు. ఐతే ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.