TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీన్మార్ మల్లన్నపై దాడి! ఎవరు చేశారు? అసలేం జరిగింది? 

Published on: Sat Dec 25, 2021 9:34AM

ప్రముఖ జర్నలిస్ట్, బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై దాడి జరిగింది.  ఈ ఘటన బోడుప్పల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. క్యూ న్యూస్ ఆఫీసులోకి కొంతమంది దుండగులు వెళ్లి మల్లన్నను తిడుతూ దాడికి పాల్పడ్డారు. అక్కడున్న కంప్యూటర్లను, టీవీలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోవాలనుకునే వారిని తీవ్ర పదజాలంతో తిట్టారు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు.. బోడుప్పల్‌లోని శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్‌ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు. 

అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలాగా తీన్మార్ మల్లన్న ట్విటర్‌లో పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుపై ఆగ్రహించిన వ్యక్తులు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మల్లన్న మీడియాకు విడుదల చేశారు టీఆర్ఎస్ పార్టీ గూండాలే ఈ పని చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తన ఛానల్‌ ద్వారా నిజాలను వెల్లడిస్తున్నానని, దానిని జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వచ్చిన వారు గూండాలనుకోలేదని వారిని కూర్చోమని మర్యాదలు కూడా చేశామని చెప్పారు. తమ ఆఫీస్‌పై దుండగులు దాడిక పాల్పడుతున్నారని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, ఇప్పటికైనా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని భౌతిక దాడులు జరిగినా భయపడేదేమి లేదని.. వెనక్కి తగ్గేది లేదని మల్లన్న ప్రకటించారు.

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లనకు చెందిన క్యూ న్యూస్ మీడియా ట్విట్టర్‌లో ఇటీవల ఓ పోల్‌ను నిర్వహించింది. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్ వల్ల తీన్మార్ మల్లన్న‌పై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం నెలకొంది. దీంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ పోల్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా మల్లన్నపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.