TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన

Published on: Wed Sep 17, 2025 2:53PM

 

 

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హొటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, బీసీల వాటా అనే నినాదాలు పార్టీ జెండాలో కనిపించాయి.తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17న పార్టీని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, "తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. 

బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోంది" అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ పార్టీ బీసీలను ఎలా వంచించిందో లెక్కలతో వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. కొందరు ఈ రోజును విమోచన దినమని, మరికొందరు విద్రోహ దినమని అంటున్నారని, కానీ వాస్తవానికి ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజని ఆయన గుర్తుచేశారు. అందుకే ఈ చారిత్రక రోజున తమ పార్టీని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.