పొగడ్త.. ఓ మంచి టానిక్!

 

ఈరోజు మీకు నేను ఓ పెద్ద హోమ్ వర్క్ ఇవ్వబోతున్నా. మీ అందరికీ అదేంటో చెప్పేముందు మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి. ఓ నాలుగు రోజుల క్రితం మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ వుంటే వెళ్ళాం మేమంతా. ఒక్కరోజంతా అక్కడ అందరం కలసి వున్నాం. బోల్డన్ని కబుర్లు, నవ్వులు, ఎంత బాగా గడిచిపోయిందో ఆ రోజంతా. ఆ రాత్రి భోజనాలయ్యాక మా కజిన్ సుమ ఓ ప్రశ్న వేసింది. ‘‘సుమ అంటే ఏంటి’’ అని. ఇదేం ప్రశ్న అన్నాం మేము. కాదు చెప్పండి అంది. మేం అందరం సుమ ఎలా వుంటుందో, ఆ లక్షణాలు ఒకటొకటిగా చెప్పాం.

ఆ తర్వాత అలా అందరం అందరి గురించి ఒకరి గురించి ఒకరం ఏమనుకుంటున్నామో చెప్పాం. ఆ తరువాత ఇంతకీ ఈ ప్రశ్న ఎందుకడిగావ్ అని మా సుమని అడిగితే ఏం చెప్పిందంటే, మనం చాలాసార్లు మనవాళ్ళలో మనకి నచ్చని విషయాలని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతాం. కానీ అదే నచ్చే విషయాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆలోచిస్తాం. దీనివల్ల ఎదుటి మనిషి నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని ఎవరికి వారు బాధపడుతూ వుంటాం. నిజంగా మన పక్కవాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకున్నారు అని మనకి తెలియదు. అందుకే ఇలా మనవాళ్ళని మనం నా గురించి నువ్వు ఏం అనుకుంటున్నావని అడిగామనుకోండి-వాళ్ళ మనసులో మనపట్ల ఉన్న అభిప్రాయం తెలుస్తుంది. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అంటూ చెప్పింది. చాలాసార్లు నేను ఇలా వుండాలి.. నేనంటే ఇది అని మనపై మనకి కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు వుంటాయి. అయితే మన వ్యక్తిత్వ లక్షణాలు మన ప్రవర్తన ద్వారా నిజంగా ఎంతవరకు ఎదుటి వ్యక్తులకి చేరతాయో మనకి తెలియదు. ఇలా అడిగినప్పుడు వాళ్ళు మనపై వ్యక్తంచేసే భావాలనుబట్టి మన ఆలోచనలకి, ప్రవర్తనకి మధ్య సమన్వయం వుందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే ఎదుటి వ్యక్తులు మనల్ని గుర్తించారన్న అంశం మనకి నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే వారితో మన అనుబంధం బలపడుతుంది. అందుకే మనం అంటే ఏమిటి అన్నది మనకి తెలిసినంత స్పష్టంగా ఎదుటివారికి కూడా అర్థమయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందిట.

గుర్తింపు, పొగడ్త ఎవరికైనా ఆనందాన్నిస్తాయి. మరి ఆ గుర్తింపు, పొగడ్త మనం ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగితే! వాళ్ళకి ఆనందం ఇచ్చినట్టేగా! అలాగే వాళ్ళని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నామో వాళ్ళకి తెలిపినప్పుడు మనపై ఇష్టం, ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి అనుబంధం వుండాలంటే ఇది ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఇలా ఒకరి గురించి ఒకరు గమనించి పాజిటివ్ అంశాలను చెప్పడం ఎంతో అవసరం. మన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తెలిసినవాళ్ళు.. ఇలా మనకి కావలసిన వాళ్ళందరితో చక్కటి అనుబంధం ఏర్పరచుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాం మనం. ఆ ప్రయత్నంలో ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతెందుకు, మీ ఇంట్లోవాళ్ళతో మీకు వాళ్ళలో నచ్చే అంశాలను గురించి చెప్పి చూడండి. ఇదే నేను మీకు ఇస్తానన్న హోమ్ వర్క్. రిజల్ట్స్ ఎలా వుంటాయో మీరే చూడండి.

 

- రమ ఇరగవరపు