TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెక్కీ గణేశా: బెంగళూరులోని ఈ గుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎందుకు క్యూ కడుతున్నారు?

Published on: Fri Jul 10, 2026 12:41PM

భారతదేశంలోనే ఐటీ రంగానికి అత్యంత ప్రసిద్ధి చెందిన సిలికాన్ వ్యాలీ నగరం బెంగళూరు. ఇక్కడ లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు తమ కెరీర్‌ను నిర్మించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుడి సాషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే అక్కడి ప్రసన్న గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఐటీ ఉద్యోగుల్లో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, దాన్నే అందరూ ఎంతో ఇష్టంగా 'టెక్కీ గణేశా' అని పిలుచుకుంటున్నారు. ఈ వినాయకుడిని దర్శించుకుంటే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు వస్తాయని, ఉన్నతోద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయని, కెరీర్ తిరుగులేకుండా దూసుకుపోతుందని భక్తుల బలమైన నమ్మకం.

గత కొద్ది రోజులుగా ఈ టెక్కీ గణేశ ఆలయానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కొత్తగా ఐటీ ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యువత, ప్రాజెక్టులలో ప్రమోషన్లు ఆశిస్తున్న సీనియర్ డెవలపర్లు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఈ విఘ్ననాయకుడి మహిమల గురించి ఒక స్థానిక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reel) రూపంలో చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే ఈ భారీ రద్దీకి ముఖ్య కారణం. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న టెక్కీలు ఈ ఆలయం వైపు చూడటం మొదలుపెట్టారు.

ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా, ధ్యానానికి అనుకూలంగా ఉండే ఈ ప్రసన్న గణపతి ఆలయ వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కోరమంగళలో నివసిస్తున్న కొందరు పాత నివాసితులు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఈ ఆలయం ఇంతగా ప్రసిద్ధి చెందకముందే తమకు దీని ప్రాముఖ్యత తెలుసని గుర్తు చేసుకున్నారు. అయితే భక్తులు తమ కోరికలు నెరవేరాలని, జీవితంలో సానుకూల మార్పులు రావాలని దేవుడిని నమ్మి రావడం చాలా మంచి విషయమేనని వారు అభిప్రాయపడుతున్నారు.

మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ శివార్లలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి 'వీసా బాలాజీ'గా ఎలాంటి గుర్తింపు ఉందో, అమెరికా వీసాల కోసం భక్తులు అక్కడ ఎలా ప్రదక్షిణలు చేస్తారో, సరిగ్గా అలాగే బెంగళూరులోని ఈ కోరమంగళ గణేశుడికి 'టెక్కీ గణేశా'గా ఐటీ కమ్యూనిటీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ ఆధునిక కాలంలోనూ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నవారు తమ కెరీర్ సక్సెస్ కోసం ఈ విధంగా ఆధ్యాత్మికతను ఆశ్రయించడం విశేషం.

bangalore software professionals ganesh temple,prasanna ganapathi temple it employees