సింహాద్రి అప్పన్న సేవలో టీమ్ ఇండియా
Published on: Wed Jan 28, 2026 12:07PM

న్యూజిలాండ్ లో టి20 సిరీస్ లో భాగంగా నాలుగో మ్యాచ్ అడేందుకు విశాఖ వచ్చిన టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రసిద్ధ సింహాచలం అప్పన్న స్వామి ఆయలాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జట్టుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను జట్టు సభ్యులకు వివరించారు. పూజ అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను ఆలయ అధికారులు భారత క్రికెట్ జట్టు సభ్యులకు అందజేశారు.
అదలా ఉంటే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మూడు టి20లలో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా విశాఖ వేదికగా ఈ రోజు జరగనున్న ఐదో మ్యాచ్ లో కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. మరో వైపు ఈ టి20 సిరీస్ లో తమ పరాజయాల పరంపరకు విశాఖ మ్యాచ్ తో ఫుల్ స్టాప్ పెట్టాలని న్యూజిలాండ్ భావిస్తున్నది. టి20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఈ సిరీస్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
టీమ్ ఇండియా జట్టు అన్ని విభాగాల్లోనూ అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నది. స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందిపుచ్చుకోవడం, అభిషేక్ వర్మ ఆకాశమే హద్దు అన్నట్లుగా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతుండటం, భారత బౌలింగ్ విభాగం వికెట్ల వేట కొనసాగిస్తుండటం భారత్ కు కలిసివచ్చే అంశంగా మారింది. అలాగే టీమ్ ఇండియాకు విశాఖ కలిసొచ్చే వేదిక కావడంతో ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలుపు లాంఛనమే అన్న విశ్వాసాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.


