TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్

Published on: Tue Mar 4, 2025 9:51PM

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఫైనల్స్ కు చేరింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో  నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో73 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు.  ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 పరుగులు, అలెక్స్ కేరీ 61 పరుగులు చేశారు. దీంతో 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 48.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్స్ కు చేరుకుంది.  

ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (29) శుభమన్ గిల్ (8) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమ్ ఇండియాను కింగ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు గాడిలో పెట్టారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపులేమీ లేకపోయినా గ్యాప్స్ లోకి బంతిని ఆడుతూ సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఈ స్కోరులో కేవలం 5 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. కోహ్లీ 50 సింగిల్స్ తీశాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు.

ఆ తరువాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడారు. హార్డిక్ పాండ్యా మూడు సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. రాహుల్ 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.   బుధవారం లాహోర్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ లో గెలిచిన జట్టుతో టీమ్ ఇండియా ఆదివారం జరిగే ఫైనల్ లో తలపడుతుంది. చాంపియన్స్ ట్రోపీలో ఫైనల్స్ కు చేరడం ఇది ఐదో సారి. గతంలో 2000, 2002, 2013, 2017లలో కూడా భారత్ సెమీస్ కు చేరింది.