తండ్రైన హర్భజన్

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌‌కు భర్త నుంచి తండ్రిగా ప్రమోషన్ లభించింది. భజ్జీ భార్య గీతా బస్రా లండన్‌లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హర్భజన్ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆరు సంవత్సరాల ప్రేమ తర్వాత 2015 అక్టోబర్‌లో హర్భజన్-గీతా బస్రాలు వివాహం చేసుకున్నారు. హర్భజన్ తండ్రైన విషయం తెలియగానే అతని సహచరులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.