TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ గొంతులో పచ్చివెలక్కాయ..!

Published on: Tue Apr 12, 2016 12:05PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వివిధ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఆ ఒక్క ఇంటర్వ్యూ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా విషయాలు పక్కనబెడితే పవన్ తన మాటలతో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పెంచేశారు. చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటారా?బీజేపీలోకి వస్తారా?అసలు జనసేన పార్టీ ఏమవుతుంది?అన్నయ్య దారిలో పవన్ నడుస్తారా?లేక అన్నయ్యనే తన దారిలోకి తెచ్చుకుంటారా?అంటూ రకరకాల క్వశ్చన్స్ నిన్న మొన్నటి వరకు అభిమానులు, రాజకీయపార్టీల మెదళ్లను తొలిచేసింది.  పవన్ ద్వారా ఏపీలో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న బీజేపీకి గబ్బర్ సింగ్ పెద్ద షాక్ ఇచ్చాడు. తాను 2019లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపాడు. ఈ ఒక్క డైలాగ్‌తో బీజేపీ నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టైంది.

 

ఏపీలో ప్రస్తుత రాజకీయాలన్న కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వస్తూనే కాపులకు ఉన్నత పదవులు కట్టబెట్టి టీడీపీ ఎప్పుడూ కాపు కాస్తుంది అన్నారు చంద్రబాబు. అయితే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టడం, ఈ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి అణచివేయడం అన్ని చకచకా జరిగిపోయాయి.

 

అయితే దీనిని మళ్లీ రగిల్చి కాపుల అందడండలు అందుకోవాలని కమల దళం స్కెచ్ గీస్తోంది. టీడీపీ కమ్మవారికి, వైసీపీ రెడ్లకు బ్రాండ్ పార్టీలు. చిరంజీవి ప్రజారాజ్యంతో కాపులకి ఐడెంటీటీ తెచ్చే ప్రయత్నం తెచ్చారు కాని అది వర్కవుట్ అవ్వలేదు. దీంతో బీజేపీ కాపులు అనే గోల్డెన్ ఛాన్స్ మిస్సవ్వకూడదనుకుంటుంది. బీజేపీని బలమైన శక్తిగా మార్చాలంటే కాపు ముద్ర పడాల్సిందేనని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. 2019 నాటికి పవన్ కళ్యాణ్‌ని పార్టీలో కలిపేసుకోవడం కాని, లేదా జనసేనతో కలిసి పోటీ చేయడం ద్వారా లాభపడాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా పవన్ పెద్ద షాకిచ్చారు.

 

తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని..జనసేన తరపున అభ్యర్ధులను రంగంలోకి దింపుతానని పవన్ మీడియా సాక్షిగా ప్రకటించారు. అంతేకాకుండా జనసేన ఏ కూటమిలోనూ కలవదని, చావోరేవో ఒంటరిగానే తేల్చుకుంటుందని సెలవిచ్చారు. పవన్ ద్వారా రాజకీయశక్తిగా ఎదగాలనుకున్న బీజేపీ అధిష్టానానికి ఈ ప్రకటన దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరి బీజేపీ పవన్‌ని తన దారిలోకి తెచ్చుకుంటుందా లేక పవన్ నుంచి పోటీ ఎదుర్కుంటుందా అనేది వేచి చూడాలి.