ఖమ్మంలోని ఆ మూడు స్థానాల్లో 'టీడీపీ'దే విజయమా?

 

అసెంబ్లీ రద్దుకి ముందువరకు అసలు తెలంగాణలో టీడీపీ ఉందా? అని అడిగినవాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు తేదీ దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో టీడీపీ ఇంత బలంగా ఉందా!! అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందింది. అయితే తరువాత ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ పార్టీని వీడారు. ఎమ్మెల్యేలే కాదు పలువురు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడారు. మెజారిటీ నాయకులతో పాటు కేడర్ కూడా టీడీపీని వీడారు.. దీంతో ఇక తెలంగాణలో టీడీపీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలు తప్పని రుజువైంది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయటం. అనూహ్యంగా ప్రజకూటమితో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవ్వడం జరిగిపోయాయి. దీంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటనకు భారీగా తరలివచ్చి అంతా పసుపు మయం చేశారు. ఇక అక్కడినుంచి టీడీపీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖమ్మం, హైదరాబాద్ ఇలా ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో తెలంగాణలో టీడీపీ ఇంకా బలంగానే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు టీడీపీ బలం తోడవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ఎంతలా చర్చలు జరుగుతున్నాయో.. ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తున్న 13 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? అంటూ అంతే చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ పోటీ చేస్తున్న వాటిలో మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తున్న మూడు స్థానాల్లో టీడీపీ గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఖమ్మం జిల్లాలో టీడీపీ.. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల్లో పోటీ చేస్తుంది. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. పువ్వాడ గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి.. టీడీపీ అభ్యర్థి తుమ్మల మీద విజయం సాధించారు. తరువాత పువ్వాడ, తుమ్మల ఇద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఖమ్మం బరిలో పువ్వాడ, నామా ఉన్నారు. ఖమ్మంలో టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉంటాయి. వాటికి తోడు సీపీఐ కూడా ఉంది. ఈమధ్య ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ, చంద్రబాబు సభ నామాలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందనే చెప్పాలి. అదీగాక పువ్వాడ పార్టీలు మారుతుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో నామా గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నారు. ఈయనకి నియోజకవర్గంలో మంచి పేరుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన పలువురు.. పార్టీని వీడినా ఆయన మాత్రం టీడీపీనే నమ్ముకొని ఉన్నారు. ఆయనికి పోటీగా టీఆర్ఎస్.. పిడమర్తి రవిని బరిలో దించింది. పిడమర్తి గతఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరుపున పోటీచేశారు. అయితే కేవలం ఆరువేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. వైసీపీ తరుపున మట్టా దయానంద్ 73,000 సాధించి సండ్రకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తరువాత దయానంద్ టీఆర్ఎస్ లో చేరి ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం పిడమర్తికే టికెట్ కేటాయించింది. దీంతో దయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత మెత్తబడినా ఇప్పటికీ సత్తుపల్లి టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవ్వన్నీ కలిసి సండ్రకు ముచ్చటగా మూడోసారి కూడా విజయం వరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అశ్వారావుపేట విషయానికి వస్తే టీడీపీ తరుపున మెచ్చా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలోకి దిగిన తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావుపై కేవలం 930 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తరువాత తాటి టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే తాటి.. నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తుంటే పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. అడుగడుగునా గ్రామస్థులు ఆయన్ని అడ్డుకుంటున్నారు. ఆఖరికి తుమ్మల లాంటివారు రంగంలోకి దిగి మీ కోపం ఈ ఎన్నికల్లో చూపించకండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు తాజాగా సత్తుప్లల్లి సభకు హాజరైన కేసీఆర్.. తాటిని స్టేజి ఎక్కొద్దంటూ అడ్డుకున్నారు. దీనిబట్టి అర్ధం చేస్కోవచ్చు తాటి మీద ఎంత వ్యతిరేకత ఉందో. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరావు గెలుపు కష్టమేమి కాదు. గత ఎన్నికల్లో కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన.. ఇప్పుడు కూటమి బలం, తాటి మీద వ్యతిరేకతతో ఈజీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.