తొలిరోజే సభలో రచ్చ.. గో బ్యాక్ గొడవ.. టీడీపీ వాకౌట్.. అడ్డుకున్న మార్షల్స్
Published on: Mon Mar 7, 2022 10:53AM
అనుకున్నట్టే జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎప్పటిలానే ఉద్రిక్తంగా మారింది. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేశారు. గో బ్యాక్.. గో బ్యాక్.. గవర్నర్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తెలుగుదేశం సభ్యుల వాకట్ తర్వాత గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఇక.. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ ప్రజాప్రతినిధులు వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదని.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు, గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని మార్షల్స్ బయటకు పంపారు. ఈ మార్షల్స్‌తో టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.


