తిరగబడ్డ తెలుగుబిడ్డలు

 

చెయ్యెత్తి జై కొట్టిన తెలుగుబిడ్డలు ఇప్పుడు తిరగబడ్డారు. ఇద్దరూ కూడబలుక్కుని కాకపోయినా, ఒకేసారి ఢిల్లీ ఆధిపత్యం మీద తిరబడటం యాదృచ్ఛికం. మొన్నటి వరకూ ఢిల్లీ ఆధిపత్యానికి సాహో అన్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇప్పుడు ఎవరి దారిలో వారు తెలుగు పౌరుషాన్ని చూపిస్తున్నారు. ఢిల్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎవరి దారిలో వారు తిరుగుబాటలో నడుస్తున్నారు. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టు ఇద్దరూ తమ తమ రాష్ట్రాల హక్కుల సాధన కోసం  నిరసన గళం వినిపిస్తున్నారు.

 

నాలుగేళ్ళుగా ఢిల్లీ ప్రభువు నరేంద్ర మోడీ ఆధిపత్యం ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణిగి మణిగి వుండక తప్పలేదు. చేతికి చిప్ప ఇచ్చి తరిమేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టె్క్కించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇంతకాలం అనేక అంశాల మీద మౌనం వహించారు. ఢిల్లీ బీజేపీ పెద్దల అవమానాలను భరించారు. లోకల్ బీజేపీ నాయకుల తోక ఊపుడును సహించారు. సహనం ఎక్కువైపోతే మిగిలేది దహనమే అన్నట్టుగా ఆయన సహనం పరిధులు దాటిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాల రూపంలో నిరసన వ్యక్తమైంది. పూర్తిగా తెగేదాకా లాగడం ఎందుకన్నట్టుగా కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతోంది.

 

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలో ప్రధాని మోడీ మీద బోలెడన్ని సెటైర్లు వేశారు. ఆ తర్వాత మోడీ హవాని అర్థం చేసుకున్న ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతగా పొగిడినా కేంద్రం దగ్గర తెలంగాణ పప్పులు ఉడకకపోవడంతో మళ్ళీ రివర్స్ గేరు వేశారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంటంట అని ధిక్కరించారు. మోడీని ’గాడు‘ అనే సాహసం కూడా చేశారు. అయితే ఆ తర్వాత నేనలా అనలేదని చెప్పేశారు. రాష్ట్రాల గౌరవం నిలబడాలంటే మూడో ఫ్రంట్ మొదటెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పెంపుదలను కేంద్రం ఒప్పుకోకపోవడంతో పోరాటం తీవ్రంచేశారు. త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంమీద ఇద్దరు తెలుగుబిడ్డలూ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.