పవన్‌ను టార్గెట్ చేస్తోన్న టీడీపీ... జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ఇది ఇప్పుడే చెప్పటం కష్టం. కానీ, రానున్న ఎన్నికల్లో యుద్ధం ఎవరెవరి మధ్యా అన్నది మాత్రం అంతకంతకూ స్పష్టమైపోతోంది. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నడుమ పోరాటం వుంటుందని అందరికీ తెలిసిందే! అయితే, పోయిన ఎన్నికల్లో సీన్ వేరుగా వుండింది. ఒకవైపు టీడీపీ, బీజేపీ, పవన్ మోహరించారు. మరోవైపు వైసీపీ, ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒంటరి పోరు చేసి బొక్క బోర్లపడ్డాయి. కానీ, అయిదేళ్లలో అంతా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి చూస్తుంటే ఏ ఒక్కరూ మరొకరితో కలిసే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అగ్ర నాయకత్వం పవన్ ను ఏమాత్రం ఊపేక్షించవద్దని తమ కింది స్థాయి నాయకులకి చెప్పటం … ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది!

 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు సీఎంగా వున్న చంద్రబాబు తమకు చేతనైంది కొత్త రాష్ట్రానికి చేస్తూనే… మిగతాదంతా కేంద్రం వైఫల్యంగా జనానికి చూపిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగారు. ఇది చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగానే కలిసొచ్చే విషయం. ఆయన పై సానుభూతి , మోదీపై ఆగ్రహం జనాల్లో పెల్లుబుకవచ్చు. అయితే, వైసీపీని కాదని టీడీపీకి మళ్లీ జనం ఓటు వేస్తారా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది!

రోజు రోజుకు టీడీపీకి కలిసి వస్తోన్న అంశాల్లో ప్రధానమైంది… ప్రతిపక్షాల అనైక్యత! ఏ రాష్ట్రంలో అయినా, మొత్తం దేశంలో అయినా శత్రువులు విడివిడిగా పోరాడటం అధికార పక్షానికి మేలు చేస్తుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా. 2014 ఎన్నికల్లో మోదీని గెలిచిపించింది, మొన్నటి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో యోగిని గెలిపించింది అపోజిషన్ అనైక్యతే! ఇప్పుడు అదే చంద్రబాబుకు వరంగా మారేలా వుంది!

 

 

పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ తన స్టాండ్ పూర్తిగా క్లియర్ చేసేశాడు. టీడీపీకి బద్ధ వ్యతిరేకిగా తాను ఎన్నికల బరిలో దిగనున్నట్టు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గతంలో కలిసి పని చేసిన బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీకి దూరంగానే వుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ యాత్రలో దాడుల దాకా వెళ్లింది వ్యవహారం. ఇక మిగిలిన కమ్యూనిస్టుల్లో సీపీఐ పవన్ తో కలవవచ్చని ప్రచారం నడుస్తోంది. సీపీఎం సంగతి అస్సలు తెలియదు. కాంగ్రెస్ కూడా ఏపీలో ఎవరితోనూ కలిసే స్థితిలో, గతిలో లేదు! ఒంటరి పోరు చేసి ఈసారన్నా సున్నా సీట్లు తెచ్చుకోకుంటే ఆ పార్టీకి అదే పదివేలు! మరిక టీడీపీ, వైసీపీలతో కలిసేది ఎవరు? ఎవ్వరూ లేరనే చెప్పాలి!

 

 

 

టీడీపీ, వైసీపీ రెండు ఒంటరిగానే బరిలో దిగినప్పటికీ… జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ వేటికవి సింగిల్ గా ఫైటింగ్ చేస్తే… డ్యామేజ్ జగన్ కే! ఎందుకంటే, అన్ని పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటూ పోతే… ప్రధాన ప్రతిపక్షానికి లాభం అంతకంతకూ తగ్గిపోతుంది. అంటే, అంతిమంగా టీడీపీకి లాభమన్నమాటే!  బహుశా ఈ వ్యూహంతోనే పవన్ పై ఎదురు దాడికి సిద్ధం అవ్వమని టీడీపీ తన నాయకులకి, క్యాడర్ కి ఆదేశాలు ఇచ్చి వుంటుంది!