వంగవీటి రాధాకు లైన్ క్లియర్ చేసిన బొండా ఉమా!

 

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కాపు నేత బోండా ఉమ వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బోండా ఉమ ఆగస్ట్‌ 4 లేదా 5న విజయవాడ వస్తున్నారు. వచ్చిన వెంటంటే ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఆయన మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో  మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉండడంతో పార్టీలోకి వస్తే తూర్పు బాధ్యతలను అప్పగిస్తామని బోండా వద్ద వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది. 

అయితే వైసీపీ ప్రతిపాదనకు బోండా అంత ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పనిచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికలకు ముందు ఇదే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన యలమంచిలి రవి తదితరులు సీనియర్లు కావడంతో తనకు వారి నుంచి సహకారం ఉండకపోవచ్చని బోండా ఉమ భావిస్తున్నట్టు సమాచారం. 

అదీ కాక ఆ నియోజకవర్గం అయితే గద్దె రామ్మోహన్ కి మంచి పట్టున్న స్థానం కావడంతో పార్టీ మారినా అది పెద్దగా లాభించదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి ఆశించి భంగపడి పదవి దక్కకపోవడంతో అలకబూనారు. 

ఆ సమయంలో జనసేన పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఆయన స్తబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా ఉంచితే ఎన్నికల్లో ఓటమి అనంతరం కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు బొండా ఉమామహేశ్వరరావు. 

కాకినాడలో కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం అనంతరం విజయవాడలో బొండా ఉమా మహేశ్వరరావు నివాసంలో మరోసారి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్టీ వీడితేనే మంచిదనే యోచనలో తెలుగు దేశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన కాపు నేతల సమావేశాలు పెట్టినప్పుడే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేత కోసం తెలుగుదేశం పార్టీ ఆన్వేషణ ప్రారంభించి ఆ నియోజకవర్గ పార్టీ నేతల నుంచి అభిప్రాయసేకరణ కూడా చేసింది. 

అలా చేయడంతో బొండా ఉమ పార్టీ వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేసి అలక బూనారు. తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో పార్టీలోనే ఉండడానికి ఒప్పుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారితే మారనివ్వాలని మరో సారి బుజ్జగింపుల ప్రక్రియలు ఏవీ చేపట్టద్దని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే బొండా ఉమ పార్టీ మారితే టీడీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణకు లైన్ క్లియర్ అవుతుందని, ఆయన మారిన స్థానంలో కాస్త కాపుల్లో ఫాలోయింగ్ ఉన్న రాధాకి బాద్యతాలు ఇవ్వచ్చని టీడీపీ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.