వేడెక్కిన నెల్లూరు రాజకీయం.. ఫలించేనా టీడీపీ వ్యూహం?

 

నెల్లూరు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అక్కడ అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో అంటూ ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ, వైసీపీలు జిల్లాలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గనాయకులంతా వైసీపీలో చేరడంతో టీడీపీ పని గోవిందా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పక్కకు తప్పించి మంత్రి నారాయణకు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి పూర్తి పెత్తనం ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. మరోవైపు జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని టీడీపీలో చేర్పించేందుకు మంత్రి నారాయణ, ఆదాల చేసిన ప్రయత్నాలు ఫలించబోతునన్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. ఇలా వరుస పరిణామాలతో నెల్లూరు రాజకీయాలు మారిపోతున్నాయి. నెల్లూరు ఎంపి సీటు మాదేనని నిన్నామొన్నటి వరకు ధీమాగా ఉన్న వైకాపా నేతలకు 'చంద్రబాబు' ఖంగు తినిపిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలని మంత్రి నారాయణను, మాజీ మంత్రి ఆదాలను ఆదేశించారు. ఏయే నియోజకవర్గంలో ఎవరైతే విజయం సాధిస్తారో అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. సరైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కూడా మీకే ఇస్తున్నాను. ఏదైనా విషయం ఉంటే నేరుగా తనతోనే మాట్లాడాలని మిగతా వారితో మాట్లాడాల్సిన పనిలేదని చంద్రబాబు వారికి చెప్పారని సమాచారం. నియోజకవర్గ పరిధిలోని కోవూరు ఎమ్మెల్యే విషయాన్ని ఇప్పుడేం పట్టించుకోవద్దు. టిక్కెట్‌ పోలంరెడ్డికి ఇవ్వాలా? మరెవరికైనా ఇవ్వాలా? అనే విషయాన్ని తాను చూసుకుంటానని ఈ విషయంలో వాస్తవ నివేదికలను తనకు ఇవ్వాలని చంద్రబాబు వారితో చెప్పినట్టు తెలుస్తోంది.

 

 


మరోవైపు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తన కుమారుడ్ని పోటీ చేయించాలనుకున్న మంత్రి సోమిరెడ్డికి చంద్రబాబు షాక్‌ ఇచ్చారట. మీ స్వంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టి అక్కడ మీరు గెలిచే మార్గం చూసుకోండి. మిగతా నియోజకవర్గాల సంగతి నాకు వదిలేయండి అని గట్టిగానే చెప్పారట. అంతేకాదు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలవాలి.. ఏదైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురండి.. అంతే కానీ స్థానిక నేతలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారట. ఆత్మకూరు నియోజకవర్గంలో అవలీలగా విజయం సాధిస్తానని భావిస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గౌతంరెడ్డికి మంత్రి నారాయణ, ఆదాలలు చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక నేతలందరిని ఒకదారిలో నడిపించే బాధ్యతను మంత్రి నారాయణ, ఆదాల భుజాన వేసుకున్నారు. జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి త్వరలో టిడిపిలో చేరనున్న నేపథ్యంలో ఆత్మకూరులో పార్టీ మరింత పుంజుకోవడం ఖాయమని, పార్టీ అభ్యర్థి బల్లినేని కృష్ణయ్య గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కూడా టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాలపై మంత్రి నారాయణ, ఆదాలలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. నెల్లూరు సీటును అవలీలగా కైవసం చేసుకుంటామని భావిస్తున్న వైకాపా నేతలు.. మారిన పరిస్థితుల్లో మౌనం వహిస్తున్నారు. అంతే కాకుండా పలు మండలాల్లో పట్టున్న వైకాపా నేతలు టీడీపీలో చేరేందుకు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. నెలకు ఐదు రోజులు నెల్లూరులోనే ఉంటాను.. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలే కాకుండా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపించే పూచీ తనపై వేసుకుంటానని మంత్రి నారాయణ చెబుతున్నారు. మంత్రి సోమిరెడ్డిని పక్కన పెట్టి నారాయణ, ఆదాలకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. వారిద్దరూ కలసి వ్యూహరచన చేస్తున్నారు. మరి టీడీపీ వ్యూహాలు ఫలించి నెల్లూరు జిల్లాలో పాగా వేసి వైసీపీకి షాక్ ఇస్తుందేమో చూడాలి.