TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ కురువృద్దులు యడ్లపాటి కన్నుమూత..

Published on: Mon Feb 28, 2022 10:25AM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని తన కుమార్తె నివాసంలో కన్నుమూశారు. 

యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించారు. సంగం డెయిరికీ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రైతు నాయకుడిగా ఆయన సేవలు అందించారు. 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరపున, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వేమూరు ఎమ్మెల్యేగా యడ్లపాటి విజయం సాధించారు. 1978-80 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వెంకట్రావు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో యడ్లపాటి టీడీపీలో చేరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1995లో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా వెంకట్రావు బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో టీడీపీ తరఫున యడ్లపాటి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2004 నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

యడ్లపాటి మృతి విషయం తెలిసి పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పి చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి.. తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని చెప్పారు. యడ్లపాటి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

రాజకీయ యోధుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు గారి మృతి విచారకరం.  ఎమ్మెల్యేగా, మంత్రిగా, జెడ్పీ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా చేపట్టిన పదవులకే వన్నె తెచ్చారు. నిజాయితీకి నిలువెత్తు సంతకం, స్వచ్ఛమైన రాజకీయాలకి దశాబ్దాల సాక్ష్యంగా నిలిచిన పెద్దాయన యడ్లపాటి వెంకటరావు గారి కుటుంబసభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌.