బీజేపీలోకి టీడీపీ సీనియర్ నేత 'దేవేందర్‌గౌడ్‌'.!!

 

తెలంగాణ టీడీపీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా పార్టీ మారుతున్నారని అంటున్నారు. టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడర్‌ అయిన దేవేందర్‌గౌడ్‌ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గనడం లేదు. అనారోగ్య కారణాలతో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఒకప్పుడు టీడీపీలో నెంబర్‌ టూగా వెలుగొందిన దేవేందర్‌గౌడ్‌.. తరువాత తెలంగాణ అంశంతో చంద్రబాబుతో విభేదించి 'నవ తెలంగాణ ప్రజా పార్టీ' పేరుతో స్వంతంగా పార్టీని ప్రారంభించారు. తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ టీడీపీ గూటికి చేరారు. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున దేవేందర్‌గౌడ్‌ పోటీ చేసినా గెలవలేకపోయారు. అయితే ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా లేకపోయినా.. ఆయన కుమారుడు రాజకీయ ప్రవేశం చేసారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా, 2018 ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

మరోవైపు తెలంగాణలో టీడీపీ పూర్తిగా డీలా పడిపోవడంతో.. దేవేందర్‌గౌడ్‌ కుటుంబం రాజకీయంగా బాగా వెనుక పడిపోయింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయంగా ఎదుగుతోన్న బీజేపీ ఆయనను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆయన వస్తే తెలంగాణ బీసీల్లో బలమైన నాయకుడు పార్టీలో చేరినట్లు అవుతుందనే భావనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం దేవేందర్‌గౌడ్‌ కుటుంబం త్వరలోనే టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరనుందని సమాచారం.