TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

Published on: Thu Mar 2, 2023 10:55PM

తెలుగుదేశం   సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు.  కొన్ని రోజుల కిందట హార్ట్ అటాక్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు   విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం(మార్చి 2) సాయంత్రం కన్నుమూశారు.   కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు గతంలో మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా పని చేశారు.

2014లో ఆయ‌న‌ కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.  2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అనంతరం గన్నవరం ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. అయితే అనారోగ్యం బారినపడటంతో ఆయనను తప్పించి కొనకళ్ల నారాయణను ఇన్‌చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అర్జునుడు మరణంతో టీడీపీలో విషాదచ్ఛాయాలు అలుముకున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని కానీ ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అలాగే యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కూడా బచ్చుల అర్జునుడు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  నిజాయతీపరుడు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని,   ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటని ట్వీట్ చేశారు.