పశ్చిమ టీడీపీలో.. చేరికలతో తంటా

 

 

 

పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీలోకి భారీస్థాయిలో వలసలైతే వస్తున్నారు గానీ, నాయకుల చేరికతో పార్టీ బలపడాల్సింది పోయి లేనిపోని కొత్త తలనొప్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముందు వరుసలో నిలబడి టీడీపీ తీర్థం పుచ్చుకోగా, భీమవ రం ఎమ్మెల్యే అంజిబాబు సోమవారం టీడీపీలో చేరారు. నేడో రేపో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి పితాని సత్యనారాయణ కూడా చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

 

అయితే, వీరందరినీ సహృదయంతో ఆదరించే స్థానిక నేతలు కరువయ్యారు. పదేళ్లుగా అధికారానికి దూరమైనా పార్టీ జెండాలను మోస్తూ, పార్టీ తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేస్తు న్న తమకు కాకుండా ఇప్పటికిప్పుడు పార్టీలో చేరుతున్న నాయకులకు పెద్దపీట వేస్తూ టికెట్లు కేటాయిస్తే ఊరుకోమని పాత నాయకులు తెగేసి చెబుతున్నారు. కొట్టు సత్యనారాయణ, ఈలి నాని రాకవల్ల ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు వర్గానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ, జెడ్పీ చైర్మన్ పదవిని ఆశచూపి ఆయనను తాత్కాలికంగా బుజ్జగించారు.

భీమవరం సీటును అంజిబాబుకు కేటాయిస్తే గాదిరాజు బాబు, మెంటే పార్థసారథి వర్గాలను బుజ్జగించాల్సి ఉంది. కారుమూరి, పితాని సత్యనారాయణ పార్టీలోకొచ్చి ఆచంట టికెట్ కోరితే ఇప్పటికే అక్కడ పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతున్న పెనుగొండ కాలేజి వ్యవస్థాపకుడు గుబ్బల తమ్మయ్య పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. వలస నేతలకు వీరతాడు వేయడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల పార్టీలో నిస్వార్థంగా పనిచేసే కేడర్ దూరమయ్యే ప్రమాదముందని సీనియర్ కార్యకర్తలు చెబుతున్నారు.