రాయలతెలంగాణా వ్యతిరేకిస్తున్న సీమ దేశం
Published on: Sat Jul 7, 2012 9:58AM
రాయలతెలంగాణా ప్రతిపాదనను రాయలసీమ తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. దీనిపై రాయలసీమ పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టేందుకు దేశం కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి ఆందోళన ప్రారంభిస్తామన్నారు. కమిటీ సూచించిన విధంగా తాము ఆందోళనలో పాలుపంచుకుంటామని స్పష్టం చేశారు. తమ నేత చంద్రబాబునాయుడుకు విషయం తెలిసిందన్నారు.
ఆయన అనుమతితోనే ఈ ఆందోళనను అవసరమైతే ఉధృతస్థాయికి తీసుకువెళతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ సత్తా చాటుతామని హెచ్చరించారు. తాము రాజకీయ ప్రయోజనాలు ఆశించటం లేదనీ, కేవలం పార్టీ కాకుండా అందరినీ కలుపుకుపోతున్నామనీ వివరించారు. గతంలో ఆంథ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధానిని మార్చటం ద్వారా రాయలసీమ ప్రజలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దానితో మొదలైన రాయలసీమ ప్రజల త్యాగం నేటికీ కొనసాగుతోందన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో అన్యాయం జరిగినా నోరువిప్పలేదనీ, నిజాం హయాంలో మరోప్రాంతానికి రాయలసీమను బహుమతిగా ఇచ్చినా ఏమీ మాట్లాడలేకపోయారనీ, కర్నాటకలో బళ్లారిని విలీనం చేసినా చూస్తూనే ఉండిపోయామనీ ఆందోళన వ్యక్తం చేశారు.


