TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పండుగ పూట టీడీపీ పోరాట పంథా..  జగన్ దిగిపోవాలి నినాదంతో నిరసన

Published on: Mon Jan 10, 2022 3:45PM

జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతోంది ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు ప్లాన్ చేసింది. మంగళవారం   ‘‘ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి’’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతోంది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం, జగన్ సర్కార్ వైఫల్యాలపై పోరాడాలని కేడర్ కు ఆయన పిలుపిచ్చారు. 

ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు నష్టం జరిగేలా ఉన్న  పీఆర్సీని పున‌ఃస‌మీక్షించాలన్నారు. గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలన్నారు చంద్రబాబు. మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లోనే మైనింగ్ దోపీడీ జరుగుతోందని, తక్షణమే మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్‌లో పడిందని అన్నారు. మైనింగ్ దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని కేడర్‌కు టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. 

మైనింగ్, మ‌ద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా వైసీపీ నేతలు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. నాడు-నేడు కార్యక్రమాల్లోనూ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వినుకొండ‌లో మ‌ద్దతు ధ‌ర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు. పంచాయతీలలో జగన్ రెడ్డి విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని  ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న హామీ నెరవేర్చాలన్నారు. సమగ్ర తాగునీటి పథకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు.