పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రగిరిలో రీపోలింగ్‌.. ఇదిగో సాక్ష్యం

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి (పోలింగ్‌ బూత్ నంబర్‌ 321), పుల్లివర్తిపల్లి(104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం(313) పోలింగ్‌ బూత్‌ల్లో మే19న రీపోలింగ్‌ నిర్వహించాల్సిందిగా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈసీ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ, ఈసీ కలిసి కుట్ర చేస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికలు జరిగిన మరుసటి రోజే టీడీపీ ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకోలేదు కానీ.. ఎన్నికలు ముగిసిన దాదాపు నెలరోజుల తరువాత వైసీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే స్పందించి రీపోలింగ్ కి ఈసీ ఆదేశించడం ఏంటంటూ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిలో ఏదో కుట్ర ఉందని కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ ఐదు బూతుల్లో టీడీపీకి, వైసీపీకి పోలైన ఓట్లను గమనిస్తే టీడీపీ అనుమానాల్లో నిజముందని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ బూత్‌ల్లో మెజారిటీ ఓట్లు టీడీపీకే పడ్డాయి. ఓ రకంగా అవి టీడీపీ కంచుకోటలనే చెప్పాలి.

2014 ఎన్నికల్లో..
పోలింగ్ బూత్ నె. 313 లో మొత్తం పోలైన ఓట్లు 320 కాగా.. టీడీపీకి 318 ఓట్లు వచ్చాయి. వైసీపీకి, ఇతరులకు ఒక్కో ఓటు చొప్పున వచ్చాయి.
పోలింగ్ బూత్ నె. 316 లో మొత్తం పోలైన ఓట్లు 859 కాగా.. టీడీపీకి 812, వైసీపీకి 33, ఇతరులకు 14 ఓట్లు వచ్చాయి.
పోలింగ్ బూత్ నె. 318 లో మొత్తం పోలైన ఓట్లు 931 కాగా.. టీడీపీకి 741, వైసీపీకి 181, ఇతరులకు 9 ఓట్లు వచ్చాయి.
పోలింగ్ బూత్ నె. 321 లో మొత్తం పోలైన ఓట్లు 626 కాగా.. టీడీపీకి 624, వైసీపీకి 2 ఓట్లు వచ్చాయి.

కేవలం టీడీపీ బలంగా ఉన్న చోట్ల నెలరోజుల తరువాత వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో రీపోలింగ్‌ నిర్వహిస్తుండడంతో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.