పయ్యావుల కేశవ్ సొంతూరులో అలజడి... గ్రామాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు...

 

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు.

ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.