ఇంత అరాచకమా...లైవ్ టెలీకాస్ట్ పై కేంద్రం ఆదేశాలు..

 

కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో నినాదాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇన్ని రోజులు టీడీపీ ఎంపీలు నిరసనలు చేస్తున్నా... కేంద్ర ప్రభుత్వం కూడా అంటి అంటనట్టుగానే వ్యవహరిస్తుంది. ఇక సభలో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు కానీ... ఏపీకి ఏం చేస్తామో మాత్రం చెప్పలేదు. ప్రసంగం మొత్తం కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. కాంగ్రెస్ వల్లే ఇదంతా జరిగిందని... కాంగ్రెస్ వల్లే ఏపీకి సమస్యలని ఏకిపారేశారు. కాంగ్రెస్ న్యాయం చేయలేదు అని అంత చెప్పిన మోడీ తాము ఏం చేస్తామన్నది మాత్రం సెలవివ్వలేదు. దీంతో ఏపీ ప్రజలు ఇంకా ఆగ్రహానికి గురయ్యారు. ఇక దీనిలో ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి నిన్న జైట్లీ వ్యాఖ్యలు.. నిన్న సభలో ప్రసంగించిన ఆయన కూడా పాత పాటే పాడారు.

 

మా రాష్ట్రం గురించి మీరు మాట్లాడండి... మా సమస్య గురించి చెప్పిన తరువాత, మీరు మిగతా స్పీచ్ ఇవ్వండి అంటూ, జైట్లీని మన ఎంపీలు చుట్టుముట్టారు. దీనికి గాను జైట్లీ, ఒక్క 15 నిమషాలు మీరు ఓపిక పట్టండి అంటూ, మీ గురించే చెప్తాను నాకు టైం ఇవ్వండి అంటూ, సముదాయించారు... దీంతో మన ఎంపీలు జైట్లీ పక్కనే నుంచున్నారు... జైట్లీకి మధ్య మధ్యలో గుర్తుచేస్తూనే ఉన్నారు.. చివరిలో ఏపీకి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు కానీ కొద్దిగా భారం తగ్గితే ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందని.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అంటూ సెలవిచ్చారు. దీంతో టీడీపీ ఎంపీలు ఇంకా నిరసనలు ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అదేంటంటే...  పార్లమెంట్లో జరిగిన సంఘటనలు మొత్తం టీవీ చానెల్స్ లైవ్ టెలీకాస్ట్ ద్వారా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఉభయసభల్లో తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీల ఎంపీలు చేస్తున్న నిరసనలు ప్రసారం చేయొద్దని లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారట. వెల్‌లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్‌లను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.  ఎంపీల ఆందోళన చూసి రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ఈ చర్యలు తీసుకునట్టు తెలుస్తుంది...మరి టీవీ ఛానెళ్ల ప్రసారాలు ఆపినంత మాత్రాన ఏం జరుగుతుందో జనాలకు తెలియదా. ఇలా చేస్తే ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందే తప్పా.. బీజేపీకి లాభం ఏం లేదు.  కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం గురించి అందరికీ తెలుసు.. ప్రసారాలు ఆపినంత మాత్రాన ఒరిగేది ఏం లేదన్న సంగతి తెలుసుకుంటే మంచిది కేంద్రం ఇప్పటికైనా..