చట్టంలో ఉన్నప్పుడు మోడీకొచ్చిన ఇబ్బంది ఏమిటట..?

విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు కేంద్రం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఏపీకి జరిగిన అన్యాయం గురించి జాతీయ స్థాయిలో తెలిసేలా చేసారు.. అలానే లోక్ సభ, రాజ్య సభ సాక్షిగా కేంద్రాన్ని నిలదీశారు.. ఏపీకి న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని చెప్పిన టీడీపీ ఎంపీలు అన్నట్టుగానే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.. తాజాగా టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుని వివరించి.. విభజన చట్టం అమలు, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై వినతిపత్రం అందించారు.

 

 

రాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీలు ఇదే విషయాన్ని వెల్లడించారు.. సీఎం రమేష్ మాట్లాడుతూ.. విభజన చట్టం అమలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని కేంద్రం అమలు చేయడం లేదని తాము రాష్ట్రపతికి చెప్పామని అన్నారు.. ఉక్కు పరిశ్రమ సాధ్యాసాధ్యాలపై నివేదిక కూడా వచ్చిందని, ప్రధాని అనుమతి ఇస్తే సరిపోతుందని చెప్పామన్నారు.. చట్టంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని అడిగిన రాష్ట్రపతి.. సంబంధిత శాఖలకు సూచనలు చేస్తామని తమకు హామీ ఇచ్చారని సీఎం రమేష్ తెలిపారు.. అంతాబాగానే ఉంది కానీ 'చట్టంలో ఉన్నప్పుడు అమలు చేయడానికి ఇబ్బంది ఏమిటి?' అని రాష్ట్రపతి మోడీని ప్రశ్నించి హామీలు అమలయ్యేలా చేస్తే ఇంకా బాగుంటుంది.