TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వెనుక దేవినేని ఉమా!!

Published on: Thu Jun 6, 2019 11:48AM

 

టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభలో టీడీపీ విప్ పదవిని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ విప్ గా కేశినేని నానిని నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేశినేని మాత్రం.. ఈ పదవికి తాను అర్హుడిని కాదనీ, మరొకరికి అప్పగించాలని చంద్రబాబును కోరారు. అయితే కేశినేని అలక వెనుక మరో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

 

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పలువురు టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. దీంతో ఈ బాధ్యతలను చంద్రబాబు కేశినేనికి అప్పగించారు. అయితే మధ్యలో ఏమయిందో తెలియదు కానీ, పార్టీ కార్యాలయం ఏర్పాటు బాధ్యతలు దేవినేని ఉమకు ఇచ్చారు. దీంతో తనకు ఇచ్చిన బాధ్యతలను కనీసం చెప్పాపెట్టకుండా పార్టీ అధిష్ఠానం మరొకరికి అప్పగించడంపై నాని కలత చెందినట్లు సమాచారం. అందువల్లే లోక్ సభలో టీడీపీ విప్ పదవిని సైతం కేశినేని నాని తిరస్కరించారని తెలుస్తోంది.

 

 

మరోవైపు కేశినేని ఈరోజు ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. శ్రీశ్రీ రచనల్లోని ఎంతో పాప్యులర్ అయిన వాక్యం "పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప" అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు కేశినేని ఏదో అసంతృప్తితో ఉన్నారని, కీలక నిర్ణయం ఏదో తీసుకోనున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి కేశినేని టీడీపీలో కొనసాగుతారో లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తారో చూడాలి.