వీరోచితంగా పోరాడి...వెన్నుచూపుతావా? అలాగైతే జీవితాంతం పారిపోవాల్సిందే...

తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో గన్నవరం నియోజకవర్గంలో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ వంశీ మంటలు ఇంకా చల్లారలేదు. అసలేం జరుగుతుందో క్లారిటీ లేక రెండు పార్టీల్లో లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేని టీడీపీ... వల్లభనేని వంశీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వల్లభనేనిని ఏదోవిధంగా పార్టీలోనే కొనసాగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇక, చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.... వల్లభనేని వంశీతో మూడు గంటలపాటు చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా చంద్రబాబుతోపాటు తెలుగుదేశం కుటుంబం మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

కుటుంబంలో, వ్యాపారాల్లో ఉన్నట్లే... రాజకీయాల్లోనూ సమస్యలు ఉంటాయని, అయితే రాజకీయంగా రాటుదేలాలంటే కొన్ని ఒత్తిళ్తు భరించక తప్పదని కేశినేని అన్నారు. అయినా వీరోచితంగా పోరాడి గెలిచిన వంశీ.... ఇప్పుడు వెన్నుచూపడం మంచిది కాదని హితవు పలికారు. పారిపోవడం మొదలుపెడితే... జీవితాంతం పారిపోవాల్సి వస్తుందన్నారు. అయితే, వంశీకి చెప్పాల్సినదంతా చెప్పామన్న కేశినేని నాని, బంతి ఇప్పుడు వల్లభనేని కోర్టులో ఉందన్నారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో.... పార్టీకి వల్లభనేని కూడా అంతే అవసరమన్నారు. అయితే, వంశీ ఎటూతేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు స్వయంగా కేశినేనే వ్యాఖ్యానించడంతో... వల్లభనేని... టీడీపీ చేయి దాటినట్లే కనిపిస్తున్నారు.