ఏపీ ఎన్నికల్లో కుట్ర.. అందుకే వైసీపీ మౌనం

 

ఏపీలో ఎన్నికలు ముగిసినా ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ఆగట్లేదు. ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఈవీఎంల పనితీరుపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తుంటే.. వైసీపీనేమో టీడీపీకి ఓడిపోతామని తెల్సింది అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటోంది. అయినా టీడీపీ నేతలు వ్యాఖ్యలు ఆపట్లేదు. తాజాగా టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. ఈవీఎంల మొరాయింపుపై వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, దీన్ని బట్టే కుట్రేదో జరిగిందనే అనుమానం వస్తోందని అన్నారు.

ఏపీలో పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని కనకమేడల ఆరోపించారు. ఈసీ తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారన్నారు. అయినా ప్రజలంతా పట్టుదలతో అభివృద్ధికి ఓటు వేశారని గుర్తుచేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని మొదట్నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. మేము ఆరోపించినట్టుగానే పోలింగ్ జరిగిందన్నారు. ఏపీలో మాదిరిగానే మిగతా రాష్ట్రాల్లో కూడా అలా జరగకూడదనే ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎంలలో తలెత్తిన సమస్యల వల్ల ఎవరికి ఎవరు ఓటు వేశారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈవీఎంల మొరాయింపుపై వైసీపీ ఇప్పటిదాకా ఒక్క కామెంట్ చేయలేదంటే.. వారి కుట్రేంటో అర్థమవుతుందన్నారు. అందుకోసమే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లు కూడా లెక్కించాలని ఈసీని కోరతామన్నారు. జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. అలాగే కేసీఆర్‌తో స్నేహం చేయాలని జగన్ కూడా తాపత్రాయం పడుతున్నారని చెప్పారు. జగన్‌కు రాష్ట్ర ప్రజల కంటే కేసీఆరే ముఖ్యమని కనకమేడల విమర్శించారు.