అవిశ్వాసానికి వెళ్లకపోతే… జేసీ ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బ తీసినట్లేనా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఇది పాత మాటే. కానీ, కొత్త విషయం ఏంటంటే…. అసలు ఇప్పటి రాజకీయాల్లో మిత్రులు అంటూ ఎవరూ వుండటం లేదు! ఎవరు ఎప్పుడు ఎలా కుట్ర చేస్తారో తెలియదు. ఎవరు ఎందుకు ఇబ్బంది కలిగిస్తారో అర్థం కాదు! అసలు ఎవరి ఎవరి వైపున నిలబడుతున్నారో కూడా క్లారిటీ వుండటం లేదు!

 

 

టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మద్దతు పలికింది. అసలు చరిత్రలో ఏనాడూ కలవని టీడీపీ, కాంగ్రెస్ లు మోదీ విషయంలో ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఇంత వరకూ అందరికీ అర్థమయ్యే వ్యవహారమే. కానీ, తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానికి తానే హాజరుకానని జేసీ దివాకర్ రెడ్డి అనటం … నిజంగా ఆశ్చర్యకర పరిణామమే! ఇంతకీ జేసీ సమస్య ఏంటి?

జేసీ దివాకర్ రెడ్డి తాను పార్లెమంట్ కు వెళ్లనని భీష్మించి అనంతపురంలో కూర్చున్నారు. ఎంపీగా ఎన్నికైన ఆయన సభ నడుస్తుంటే ఇంట్లో కూర్చోవటం ఏంటి? ఓట్లు వేసిన జనానికి జవాబుదారి అంటూ ఏం లేదా? అది పక్కన పెడితే టికెట్ ఇచ్చిన పార్టీ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయమని విప్ జారీ చేసింది. దాన్నైనా గౌరవించాలి కదా? ఇంత కాలం జేసీ కూడా మిగతా ఎంపీలతో కలిసి ఆంద్రాకు అన్యాయం జరుగుతోందనే అన్నారు. తీరా ఇప్పుడు ఓటు వేసి మోదీ సర్కార్ ను బోనులో నిలబెట్టే సమయం వస్తే ఆయన వెళ్లకుండా వుండిపోతున్నారు! ఇదెక్కడి విడ్డూరం?

 

 

దిల్లీకి వెళ్లకపోవటానికి జేసీ చెబుతోన్న కారణాలు కూడా విచిత్రంగానే వున్నాయి. మోదీ ప్రధానిగా వున్నంత కాలం ఏపీకి ఏమీ రావని కుండబద్ధలు కొడుతున్నారు. ఆయన చెప్పింది నిజమే అయినా జనం కోసం , జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించాలి కదా? అది చేయకుండా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో బాధని పంచుకుంటే ఏం లాభం? ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానం వల్ల రాదని జేసీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విషయం అపార అనుభవం వున్న చంద్రబాబుకు తెలియదా? తెలిసే ఆయన అవిశ్వాస తీర్మానంతో మోదీని ఢీకొడుతున్నారంటే జనం మనోభావాల్ని జాతీయ స్థాయిలో వినిపించాలనే కదా! మరి అందులో భాగం అవ్వటానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డికి ఏంటి ఇబ్బంది?

జేసీ మొరాయింపు వెనుక అసలు కారణం వేరే అంటున్నారు టీడీపీలోని వారు. ఇప్పటికే ఆయనని బుజ్జిగించి దిల్లీ ఫ్లైట్ ఎక్కించే పనిలో వున్న కొంత మంది ఆయన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధూసూదన్ గుప్త విషయంలో గుస్సాగా వున్నారని అంటున్నారు. గుప్తా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. అది పార్టీకి కూడా ఇష్టమే. కానీ, టీడీపీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డి మాత్రం మధూసూదన్ గుప్తా చేరికని ఇష్టపడటం లేదు. అందుకే, అదును చూసి టీడీపీ అధిష్టానం పై ఒత్తిడి పెంచారని టాక్!

 

 

జేసీ అలకకి కారణాలు ఎలా వున్నా… ఆయన తన వ్యక్తిగత , రాజకీయ అంశాల కారణంగా ప్రత్యేక హోదా విషయాన్ని లైట్ తీసుకోవటం బాధాకరమే! పార్టీని, పార్టీ అధినేతని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తూ ఆయన జనం ముందు చులకన అవుతున్నారు. ఆంధ్రులకు ఎమోషనల్ ఇష్యూగా మారిన హోదా విషయంలో జేసీ పునరాలోచించుకుంటే మంచిది. దిల్లీకి వెళ్లి మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎంపీగా తన బాద్యత నిర్వర్తిస్తే చరిత్రలో పేరు చెడిపోకుండా స్థిరమవుతుంది!