ఆప్ఘన్ డ్రగ్స్ దందా వెనుక విజయసాయి రెడ్డి? బిగ్ బాస్ డైరెక్షన్ లోనే మాఫియా..?
Published on: Sun Oct 3, 2021 1:25PM
ఆప్ఘనీస్తాన్ నుంచి ఏపీలోని విజయవాడ అడ్రస్ తో రవాణా అవుతూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కేసులో విచారణ కొనసాగుతోంది. దాదాపు 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ కావడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. డ్రగ్స్ దందా వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. డీఆర్ఐ విచారణలోనూ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన హెరాయిన్ విజయవాడకు రవాణా అవుతుండటంతో ఏపీలో పెను సంచలనమైంది. మచిలిపట్నంతో పాటు కాకినాడ పోర్టులు డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆప్ఘనీస్తాన్ నుంచి రవాణా అవుతున్న డ్రగ్స్ దందా నడిపిస్తున్న మాఫియాకు ఏపీలోని అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకయ్య సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని ఆయన ఆరోపించారు. మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు బుద్దా వెంకన్న. ఈ నేపథ్యంలో వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తెలియవచ్చిందన్నారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్ వ్యవహారం గుట్టుమట్లు బయటపడతాయన్నారు.
డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూ ఆక్రమణల్లో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్‌కు సహకరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బిగ్ బాస్‌కు తెలియకుండా విజయసాయిరెడ్డి ఏమీ చేయరనేది వాస్తవమన్నారు. ఈ విషయం గ్రామాల్లో అరుగుల మీద కూర్చునే ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం విజయసాయి అక్రమార్జన, అవినీతి గుట్టుమట్లను చేధిస్తుందన్నారు. ఏ2 చేసిన అవినీతికి శిక్షలు వేయాలంటే రాజ్యాంగంలో ఇప్పుడున్న శిక్షలు సరిపోవని బుద్దా వెంకన్న అన్నారు.


