బాబుకి షాకిచ్చిన జగన్.. టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు!!

 

మా పార్టీతో ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు  టచ్‌లో ఉన్నారో తన నోటితో తాను చెప్పలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనను అభినందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగించారు. ఈ సమయంలో పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన ప్రస్తావించారు. అప్పుడు స్పీకర్ సీతారాం జోక్యం చేసుకొని.. ఈ విషయమై మరోసారి మాట్లాడుదామని  చెప్పారు.

అదే సమయంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయమై ప్రసంగించారు. గత అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలను జగన్ ప్రస్తావించారు. గత ఐదేళ్లలో టీడీపీ చట్టాలను తూట్లు పొడిచిందన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.

గత ఐదేళ్లలో చంద్రబాబు చేసినట్టుగా తాను వ్యవహరిస్తే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడ దక్కదన్నారు. తాను డోర్ తెరిస్తే.. ఎవరూ కూడ మిగలరన్నారు. తనతో ఎందరు టచ్‌లో ఉన్నారో తన నోటితో తాను చెప్పలేనని జగన్ సంచలనవ్యాఖ్యలు చేశారు. సభలో ప్రతిపక్షం ఉండాలని  తాను కోరుకొంటున్నట్టుగా జగన్ చెప్పారు. గత ఐదేళ్లలో టీడీపీ అవలంభించిన విధానాలకు దేవుడు, ప్రజలు  గూబ గుయ్యుమనేలా తీర్పు ఇచ్చారని జగన్ విమర్శించారు.