TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ను దూషించిన టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. కక్ష సాధింపు చర్యలు స్టార్ట్!!

Published on: Thu Jun 6, 2019 1:10PM

 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఉల్లఘించడమే కాకుండా, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను దూషించారంటూ వైసీపీ నేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన రామకృష్ణబాబు.. ప్రధాని మోదీ, వైఎస్ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలిచారని ఆరోపించారు.అంతే కాదు అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోయారు. ఈ వీడియో ఆధారంగా.. వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థి విజయ నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీడియోను పరిశీలించిన పోలీసులు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతోపాటు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ని అసభ్య పదజాలంతో దూషించారని రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ 294 (బి), 188 సెక్షన్ల కింద క్రైమ్‌ నంబర్‌ 158/19తో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు. దీంతో బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యారు. రామకృష్ణబాబును అరెస్ట్ చూపించి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రామకృష్ణబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు. అందుకు తనపై పెట్టిన కేసే ఒక ఉదాహరణ అన్నారు. అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని రామకృష్ణబాబు హెచ్చరించారు.