ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద షాక్.. సీఎం జగన్ కు జై కొట్టనున్న మరో ఎమ్మెల్యే

ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార వైసిపిలో చేరడమో లేక ఆ పార్టీకి సపోర్ట్ గా ఉండడమో చేస్తుండగా తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే టీడీపీకి దూరం కానున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు ఆయన సీఎం జగన్‌ను కలవనున్నారు. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. 

 

ఇప్పటికే గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి గణేష్‌ దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే వాసుపల్లి గణేష్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గణేష్ సీఎం జగన్‌ను కలిసినా వైసీపీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి మద్దతు తెలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

మరో పక్క వాసుపల్లి గణేష్ టీడీపీ గుడ్ బై చెప్పడం వల్ల టీడీపీకి భారీ నష్టమే జరుగుతుంది. ఇప్పటికే విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేయడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ చేరిక వైసిపికి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.