పార్టీ లైన్ దాటను.. చంద్రబాబు ఆదేశాలే నాకు శిరోధార్యం..! : బోండా ఉమ
Published on: Tue Jul 28, 2026 6:18PM
.webp)
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో కూడా అదే విధంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసావహిస్తూ పనిచేస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా అక్కడ పలువురు రాజకీయ నాయకులు ఉన్నారని, ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన వద్దకు వచ్చి పలకరించారని చెప్పారు.
మర్యాదపూర్వకంగా జరిగిన ఆ పలకరింపునే కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని తనపై విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని, తన వ్యాఖ్యలను కూడా సందర్భానికి భిన్నంగా ప్రచారం చేశారని బోండా ఉమ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా భవిష్యత్తు లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ అంశంపై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఇప్పటికే తన వివరణ ఇచ్చినట్లు వెల్లడించిన బోండా ఉమ, పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్టీ క్రమశిక్షణకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.
TDP MLA Uma, CM Chandrababu, TDP, Naralokesh, Mudragada Padmanabham, Social media,
Ambati Rambabu


