TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నకిలీ సర్టిఫికెట్ తో లా అడ్మిషన్.. స్పీకర్ తమ్మినేనిపై రాష్ట్రపతికి కూన ఫిర్యాదు

Published on: Tue Mar 28, 2023 10:52AM

తమ్మినేని నకిలీ  సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటూ రాష్ట్రపతికి తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు.  తాను డిగ్రీ చదవలేదంటూ తమ్మినేనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆ ఫిర్యాదులో కూన పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా తమ్మినేని డిగ్రీ చదవలేదనే పేర్కొన్నారన్న కూన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో  కోరారు.

అలాగే ఇదే విషయంపై    ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎం జగన్‌..కు లేఖలు రాశారు.  తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని స్వయంగా పేర్కొన్నారని కూన గుర్తు చేశారు.

అంతేకాదు, 2019 సాధారణ ఎన్నికల  సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లోనూ  తన అత్యున్నత విద్యార్హత ఇంటర్మీడియెట్ మాత్రమేనని, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలోనే మానేశానని ఆయన స్వయంగా వెల్లడించిన విషయాన్ని కూన రవికుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, తమ్మినేని లా పరీక్షలకు హాజరైనట్టు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ను, ఎన్నికల అఫిడవిట్‌ను కూడా ఆయన ఆ లేఖలకు జత చేశారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం సరికాదని, విలువలకు, నైతిక ప్రవర్తనకు కట్టుబడలేదని, కాబట్టి ఆయన శిక్షార్హుడని, తమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టంముందు అందరూ సమానమేనని చాటిచెప్పాలని ఆయన ఆ లేఖలో కోరారు.