TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక ఎన్నికలు: తెలుగుదేశం తొలి జాబితా.. సామాజిక సమతుల్యం, యువత, విద్యావంతులకు పెద్దపీట.!

Published on: Sat Oct 17, 2026 2:52PM

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ  సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను  విడుదల చేసింది.  సామాజిక సమతుల్యత, యువతకు పెద్ద పీట,  విద్యావంతులకు ప్రాధాన్యత ఇస్తూ  వెలువడిన తొలి జాబితాపై పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.   మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు,  29 మున్సిపాలిటీలకు మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం తొలి జాబితాలో ప్రకటించింది. ఈ జాబితా ద్వారా   సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు విస్పంష్టంగా చాటింది.

విడుదల చేసిన మొత్తం 36 స్థానాల జాబితాను పరిశీలిస్తే,   అత్యధికంగా 22 స్థానాలు  అంటే దాదాపు 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకే కేటాయించింది. మరీ  ముఖ్యంగా  బీసీలకు  అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 16 స్థానాలను అంటే రమారమి  44 శాతం సీట్లను కేటాయించింది. అలాగే  ప్రకటించిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకంగా ఐదు మేయర్ స్థానాలను బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది.  పార్టీ తమ సామాజిక ఆకాంక్షలను ఆచరణలో చూపించింది. ఇక ఆళ్లగడ్డ, రాయచోటి పరిధిలో మైనారిటీ వర్గాలకు అవకాశం ఇచ్చింది.

ఈసారి అభ్యర్థుల ఎంపికలో విద్యా అర్హతలకు,  యువ నాయకత్వానికి తెలుగుదేశం పెద్ద పీట వేసింది.  మొత్తం 36 మంది అభ్యర్థుల్లో 25 మంది అంటే సుమారుగా 76 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారే కావడం విశేషం. ఈ 36 మందిలొ  ఏడుగురు పీజీ పట్టభద్రులు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. అభ్యర్థుల సగటు వయస్సు 45.7 సంవత్సరాలుగా ఉండగా, 16 మంది 45 ఏళ్లలోపు వారే కావడం యువ రక్టానికి తెలుగుదేశం ఇచ్చిన ప్రాధాన్యతను ఎత్తిచూపుతోంది. రాజంపేట నుంచి పోటీ చేస్తున్న 26 ఏళ్ల డాక్టర్ దంతం గాయత్రి వీరిలో అత్యంత పిన్న వయస్కురాలైన అభ్యర్థిగా నిలిచారు.

స్థానిక సంస్థల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా టీడీపీ మరో అడుగు ముందుకేసింది. చట్టబద్ధంగా మహిళలకు రిజర్వ్ అయిన 17 స్థానాల పరిధిని దాటి, మరో రెండు జనరల్ స్థానాల్లోనూ మహిళలకే అవకాశం కల్పించింది. సాధారణ కేటగిరీకి చెందిన చిత్తూరు కార్పొరేషన్, బద్వేల్ మున్సిపాలిటీల్లో మహిళా అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా మొత్తం 19 మంది మహిళలకు అంటే 53 శాతం అవకాశం ఇచ్చింది.  

క్షేత్రస్థాయిలో ప్రజల ఆమోదం, వ్యక్తిగత ప్రతిష్ట, విద్యా అర్హతలు,  సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ప్రాతిపదికగానే ఈ ఎంపికలు జరిగాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘంగా నిర్వహించిన అంతర్గత సర్వేలు, స్థానిక నాయకత్వ అభిప్రాయాల సేకరణ తర్వాతే తుది జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఎంపిక ద్వారా ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా, బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచినట్లైంది. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు కీలకమైన ప్రజా ప్రతినిధుల తయారీ కేంద్రాలుగా మారుతాయని, అలాంటి చోట విద్యాధికులు, యువకులు మరియు మహిళలకు పెద్దపీట వేయడం వల్ల సద్పరిపాలన సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

[TDP local body candidates 1st List, AP Municipal Elections,  TDP  Social Justice TDP Candidates,  BC SC women Youth, Chandrababu Naidu, Telugu One]